శ్రీ శ్రీ మృణాళినీమాత నుండి 2015 నూతన సంవత్సర సందేశం

“మీపై మీరు విజయునిగా ఉండటమే నిజమైన విజయం – మీ గిరిగీసుకున్న చైతన్యాన్ని జయించి మీ ఆధ్యాత్మిక శక్తులను అపరిమితంగా విస్తరించవచ్చు. మీరు వెళ్ళాలనుకున్నంత దూరం వెళ్ళవచ్చు, అన్ని పరిమితులను దాటి మహోన్నతంగా సఫలవంతమైన జీవితాన్ని గడపవచ్చు.”

— శ్రీ శ్రీ పరమహంస యోగానంద

మనం కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న వేళ, గురుదేవులు పరమహంస యోగానందగారి ఆశ్రమాలలో ఉన్న మేమందరం ఉద్ధరించబడి, ఆయన బోధనలలోని దైవానుసంధానమును, తనకు ఇతరులకు కూడా సంతోషాన్ని తీసుకువచ్చే కాలాతీతమైన సత్యాలను ఆచరిస్తున్న చిత్తశుద్ధిగల ఆత్మల వృద్ధిచెందుతున్న కుటుంబాన్ని తలచుకుంటూ ప్రేరణ పొందాము. ఆ ఆదర్శాలకు మీరు అంకితం అయినందుకు మరియు మీ పండుగ శుభాకాంక్షలు, జ్ఞాపకాలలో, అలాగే సంవత్సరం పొడవునా మీ ఆలోచనాత్మకతలో వ్యక్తీకరించిన దివ్య స్నేహానికి మేము మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ప్రతిరోజూ మా ప్రార్థనలలో, మీ జీవితంలో ఆయన వెలుగు మరియు ప్రేమను ప్రవహించేలా దేవుడు మీ గొప్ప సంకల్పాలను, మీరు చేసే ప్రతిదాన్ని ఆయన ఆశీర్వదించాలని మేము కోరుతున్నాము.

ఈ నూతన ఆరంభాల సమయంలో ఊపందుకున్న సానుకూల మార్పు మన సంకల్పాన్ని మరియు మన ఆత్మలకున్న అవధుల్లేని సంభావ్యతపై మన విశ్వాసాన్ని ఉత్తేజపరుస్తుంది. ఇది మన పరిధులను విస్తృతం చేయడానికి, “నేను చేయగలను” అనే చైతన్యాన్ని మేల్కొలిపే సమయం – మనల్ని మనం మన మానవ అపరిపూర్ణతలపై కాకుండా, దేవుడు మనల్ని చూసే విధంగా చూసుకోవడంపై అంటే – ఆయన యొక్క ప్రత్యేకమైన వ్యక్తీకరణ, ఆయన దివ్య లక్షణాలను వ్యక్తపరచగల సామర్థ్యంపై దృష్టి పెట్టడం. మెరుగుపడే మన ప్రయత్నాలలో ఆ దృక్పథాన్ని ఉంచడం ద్వారా, మనలోని ఆధ్యాత్మిక విజేతను బయటకు తీసుకువద్దాం. మన జీవితాలకు బాధ్యత వహించే స్వేచ్ఛను దేవుడు మనకు ఇచ్చాడు. ఆ దివ్య వరాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలని ఇప్పటినుంచే సంకల్పించండి మరియు మీరు ఏమి సాధించగలరో దానికి పరిమితి లేదని మీరు కనుగొంటారు. గురుదేవులు మాకు ఇలా చెప్పారు: “కేవలం మీ పనుల ద్వారా మాత్రమే కాక, మీ ఆలోచనలు, భావాలు మరియు కోరికలలో మీరు ఎంత స్వచ్ఛత, ప్రేమ, అందం మరియు ఆధ్యాత్మిక ఆనందాన్ని వ్యక్తం చేయాలో ఎంచుకోగలిగే శక్తి మీలో ఉంది.” ఇతరులకు, పరిస్థితులకు ప్రతిస్పందించే విధానంలోనూ, ప్రాధాన్యతలను ఏర్పరచుకోవటంలోనూ, సమయాన్ని వినియోగించుకోవటంలోనూ, మరియు జీవితంపై మన దృక్పథాన్ని ప్రభావితం చేసే ఆలోచనలు, వైఖరుల సూక్ష్మ తలంలో మనం నిర్మించుకున్న ధోరణులను మనం తెలుసుకుంటున్న కొద్దీ – మనం మరింత మెరుగ్గా చేయడానికి, ఆయన ప్రేమ మరియు ఆనందాన్ని మరింతగా వ్యక్తీకరించడానికి దేవుడు మనకు ఇచ్చిన స్వేచ్ఛను స్థిరపరచవచ్చు. చిన్న, రోజువారీ విషయాలలో కూడా మన ఆలోచనలను మరియు ప్రవర్తనను సానుకూల దిశలో నిరంతరం నడిపిస్తే – అలవాట్లు, ఇంద్రియ ప్రేరణలు లేదా భావోద్వేగ ప్రతిచర్యలు మనను స్వాధీనం చేసుకోవడానికి అనుమతించకపోతే – మనకు మరియు మన చుట్టూ ఉన్నవారికి గొప్ప ప్రయోజనం చేకూర్చే మార్పులు చేయవచ్చు మరియు దేవుని నిత్యమైన ఆశీస్సులకు మన గ్రహణశక్తిని విస్తరించవచ్చు.

మన విముక్తిలో మనం చురుకైన పాత్రను పోషించాలని దేవుడు ఉద్దేశించాడు, అయినప్పటికీ మన ఆత్మ యొక్క వ్యక్తీకరణను పరిమితం చేసే అహం మరియు అలవాట్ల-అడ్డంకులను తొలగించడంలో సహాయం చేయడానికి ఆయన కంటే ఎక్కువ ఆసక్తి చూపేవారు ఎవరూ లేరు. గాఢమైన ధ్యానం మరియు ఆయనతో మన జీవిత సమన్వయానికి ప్రతిరోజు చేసే ప్రయత్నాల ద్వారా పోషణ పొంది దేవునితో మన అంతరంగిక సంబంధం, మన చైతన్యం ఆయన పరివర్తక శక్తిని గ్రహించేందుకు పూర్తిగా తెరుచుకుంటుంది. ఆయనపై మీ నమ్మకాన్ని మరింతగా పెంచుకోవడంతో, మీ విశ్వాసం మరియు సమానత్వాన్ని పరీక్షించే పరిస్థితులలో కూడా, ఆయన మీకు పురోగతికి అవకాశాన్ని ఇస్తున్నాడని మీరు గుర్తిస్తారు. ఒక ప్రముఖ కళాకారుడు పాలరాతి బండ నుండి దానికి చెందని ముక్కల్ని తొలగించినప్పుడు అందమైన శిల్పం ఉద్భవించినట్లుగానే, మీరు భగవంతుని సంకల్పంతో మీ సంకల్పాన్ని సరిదిద్దినప్పుడు మరియు మీ జీవితాన్ని మలుస్తున్న ఆ దివ్య శిల్పికి సహకరించినప్పుడు మీ స్వచ్ఛమైన ఆత్మ-స్వభావం దాని మాయ నుండి బయటపడుతుంది.

 మీకు మరియు మీ ప్రియమైన వారికి భగవంతుని ఆశీస్సులు మరియు ప్రేమతో నిండిన నూతన సంవత్సర శుభాకాంక్షలు,

శ్రీ శ్రీ మృణాళినీమాత

కాపీరైట్ © 2014 సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్. అన్ని హక్కులూ ఆరక్షితమైనవి.

Share this on