శ్రీ శ్రీ లాహిరీ మహాశయుల అద్భుత దర్శనము

సనంద లాల్ ఘోష్

సనంద లాల్ ఘోష్ రచించిన మెజ్దా (From the book Mejda: The Family and the Early Life of Paramahansa Yogananda) అనే గ్రంథం నుండి ఈ సంఘటన సేకరించబడింది. ఈ పుస్తకాన్ని రచించినది యోగానందగారి తమ్ముడు. వీరు యోగానందగారిని “మెజ్దా” అని పిలిచేవారు. బెంగాలి భాషలో “మెజ్దా” అంటే రెండవ అన్న అని అర్థము. మొదటి అన్నయ్య పేరు అనంత.

ఆర్డర్ చెయ్యండి

అనంతుడి దినచర్య పుస్తకము ప్రకారము అది 1906 మే నెల మూడవ తేది, ఆ రోజు మేము బెరైలి నుండి చిట్టగాంగ్ కు మారినాము. ఇక్కడున్న రోజులలో మెజ్దా ఇరుగు పొరుగు తోటలలోని పండ్లను కోసుకొని తినేందుకు నన్ను కూడా తీసుకుపోయేవాడు. మా పక్క వాళ్ళ ఇంటిలో అందమైన కొన్ని పెద్ద హంసలుండేవి. మెజ్దా ఒక ఈకతో క్విల్ పెన్ తయారుచేయాలని అనుకొని, ఒక హంస రెక్క నుండి ఒక ఈకను లాగివేశాడు. ఈ విషయాన్ని ఇంటి యజమాని కనుగొని మా అనంతన్నయ్యకు చెప్పాడు. మెజ్దా అల్లరిని అరికట్టుటకు, పగటిపూట ఇంటి నుండి బయటకు వెళ్ళకుండా కట్టడి చేసేందుకు మా ఇద్దరినీ ఆ ఊరిలోనున్న స్కూల్లో చేర్పించాడు. మెజ్దా స్కూల్లో మంచి మార్కులు తెచ్చుకొనేవాడు, నేను మామూలుగా పాసు అయ్యేవాడిని.

మీరు పక్కనే ఉన్న హార్బరుకుగాని, నది వద్దకుగాని పోరాదని మా అన్నయ్య మా ఇద్దరినీ హెచ్చరించాడు.

అయితే నేను అనుకున్నాను, “మెజ్దా అన్నయ్య మాట పాటించడు.” నిజంగానే కొన్ని రోజుల తరువాత మెజ్దా ఆ నది ముఖద్వారం వద్దకు తీసుకుపోవడము జరిగింది. ఆ రోజుల్లో “చెప్పిన మాట వినకపోవడం మెజ్దా స్వభావంగా ఉండేది.”

ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకల్లా పిల్లలందరూ ఇంటికి వచ్చి, కాళ్ళు చేతులు ముఖము కడుక్కొని, హోమ్ వర్క్ చేసుకోవాలని అనంత అన్నయ్య మాకు ఆదేశమిచ్చాడు. చిట్టగాంగ్ వద్దనున్న హార్బర్ మా ఇంటికి నాలుగు కిలోమీటర్ల దూరములో ఉంది. కావున స్కూల్ నుండి తిరిగి వచ్చి, టిఫిన్ తిని, హార్బర్ కు పోయి మళ్ళీ ఆరు గంటలకల్లా తిరిగి రావడము, మొత్తం ఎనిమిది కిలోమీటర్ల నడక సాధ్యమయ్యే పని కాదు. కావున మేమిద్దరము పరిగెత్తుకుంటూ హార్బరుకుపోయి కొంతసేపు ఓడలను చూసి, మరలా పరిగెత్తుకుంటూ ఇంటికి చేరేవాళ్ళము. దీని వలన మెజ్దా మంచి బలశాలి అయ్యాడు. నేను కూడా మెజ్దాలా కాకపోయినా ఒక మాదిరిగా బలం పుంజుకున్నాను.

నది ముఖద్వారానికిపోయే రహదారి ఎత్తుపల్లాలుగల చాలా గుట్టలతో నిండి ఉంది. ఆ దారిలో లీచి పండ్లుగల వృక్షాలు ఉన్నాయి. ఒకరోజు మెజ్దా ఇలా అన్నాడు. “ఈ రోజు సాయంత్రము ఎవరు లేని సమయంలో, ఇంటికి పోయేటప్పుడు కొన్ని లీచీ పండ్లు కోసుకొని తిందాము”.

అలా అన్నాడో లేదో మెజ్దా వెంటనే తియ్యని రుచికరమైన లిచీ పండ్లను కోస్తున్నప్పుడు, ఎవరో తనని పేరు పెట్టి పిలుస్తున్నట్టు విన్నాడు. ఆ శబ్దానికి తత్తరపడి, మెజ్దా కొంతసేపు నిశ్చలంగా నిలుచుండిపోయినాడు. పండ్లుకోసే సాహస కార్యము మధ్యలోనే ఆగిపోయింది. శబ్దము వచ్చిన వైపు మేము జాగ్రత్తగా నడక సాగించాము. ఆ సాయంసంధ్యలో, చెట్ల నీడన మేము చాలా ముందుకు చూడలేకపోయాము, కాని మేము తెల్లటి దుస్తులు ధరించిన ఒక వ్యక్తిని వెంటనే గుర్తించాము. మా భయాన్ని గమనించిన ఆయన స్నేహపూర్వకంగా మమ్మలని దగ్గరకు పిలిచారు. అయన తోటకాపరి అయితే, ఆయనకి మెజ్దా పేరు ఎలా తెలుస్తుంది?

మేము కూడా నెమ్మదిగా చిరునవ్వు చిందిస్తూన్న ఆ మనిషి వైపుకి నడిచాము. ఆయన అద్భుతమైన కాంతితో వెలుగుతూ ఉన్నట్లు మాకు అనిపించింది. నేను ఆ వెలుగు ఎటు నుంచి వస్తున్నదో తెలుసుకొనుటకు అటుఇటు చూశాను. ఉన్నట్లుండి మెజ్దా ఆయన పాదాల వద్ద మోకరిల్లి నమస్కరించాడు. ఆ సాధువు మెజ్దాను కౌగలించుకొని, నొసట ముద్దు పెట్టినాడు. నేను కూడా ఆ సాధువు పాదాలను తాకి నమస్కరించుకున్నాను. ఆ సాధువు, “జయోస్తు జయోస్తు” అని మమ్మల్ని ఆశీర్వదించారు. ఆ తరువాత వారు మెజ్దాతో ఇలా అన్నారు:

“ముకుందా! భగవంతుని కోరిక మేరకు నేను ఈ రోజు ఇక్కడకు వచ్చాను. నేను చెప్పే విషయాలను జాగ్రత్తగా విను. ఆయన కోరిక నెరవేర్చేటందుకు ఆయన ప్రతినిధిగా నీవు ఈ భూమిపై అవతరించావు. ప్రార్థన మరియు ధ్యానంతో పావనమైన నీ శరీరమే, ఆయన మందిరము. భౌతిక సుఖాల మరియు సంతృప్తుల కొరకు ఆరాటపడవద్దు. నిజమైన ఆనందాన్ని పొందే దారి నీవు చూపిస్తావు. నీ ఆధ్యాత్మిక జ్ఞానంతో అంధకారంలో ఉన్నవారి అజ్ఞానాన్ని పారద్రోలుతావు. ధ్యానము (యోగము) ద్వారా ముక్తి పొందిన ఒక మహాత్మునితో నీకు ఏకత్వముందనే సంగతిని నీవు ఎన్నడూ మరచిపోరాదు. ధ్యానంలో అత్యున్నత స్థితి పొందినవారికి మాత్రమే ఇది సాధ్యమవుతుంది. నీ శరీరము, మనస్సు మరియు జీవితము ఒక్క క్షణము కూడా భగవంతుని ఆలోచన నుండి ప్రక్కకు వెళ్ళకూడదు. ఆ అనంత పరమాత్మ ఆశీస్సులు నీపై ఉన్నాయి. ఆయనపై నీవు అచంచల విశ్వాసాన్ని కలిగి ఉండు. అన్ని అపాయాల నుండి ఆయన నిన్ను రక్షిస్తాడు. ఈ విశ్వంలో ఆయన ఒక్కడే శాశ్వతుడు. మిగిలిన అందరూ, అన్ని వస్తువులు అస్థిరమైనవి మరియు నమ్మదగినవి కావు. ఏదో ఒక రోజు నీవు బోధించే యోగ శాస్త్రము మానవాళికి గొప్ప స్ఫూర్తినిస్తుంది. ముకుందా! యోగమార్గంలో ముందుకు సాగు!”

చీకటి పడుతున్నది, కాలం గడుస్తున్నది, నాకు భయమేస్తూ ఉన్నది. ఎందుకంటే మేము ఇంటికి చాలా దూరములో ఉన్నాము. నాన్న చేత చివాట్లు, అన్నయ్య చేత దెబ్బలు తినడము ఈ రోజు తప్పదని నేను భయపడుతుంటిని. నా భయాన్ని గమనించిన ఆ సాధువు, “భయపడకండి, ఆనందంగా ఇంటికి వెళ్ళండి, మీరు ఆలస్యమయ్యారని ఎవరూ మిమ్మల్ని గమనించరు.”

మేము ఇంటికి పయనమయ్యాము. కొంత దూరము వెళ్ళిన తరువాత తిరిగి చూస్తే, ఆ సాధువు చేతులు పైకెత్తి మమ్ము ఆశీర్వదించుతూ కనిపించాడు. ఆ తరువాత అదృశ్యమయినాడు. నేను మెజ్దా వైపు తిరిగి మాట్లాడాను. కానీ మెజ్దా వినే స్థితిలో లేడు. తల వంచుకొని, ఏదో ఆలోచిస్తూ నడుస్తున్నాడు. మేము ఇల్లు చేరగానే, మెజ్దా నేరుగా పూజాగదిలోకి వెళ్ళాడు. నేను నాన్న, అన్నయ్య ఎక్కడున్నారని అడిగాను. అనంత అన్నయ్య తన స్నేహితుని ఆహ్వానం మేరకు అతని ఇంటికి వెళ్ళాడని, నాన్నగారు తన ఆఫీసులో ముఖ్యమైన సమావేశము ఉన్నందున ఇంకా ఇంటికి రాలేదని నేను తెలుసుకున్నాను. మేము ఆలస్యముగా రావడము వారికి తెలియనందున నాకు ఎంతో సంతోషము కలిగింది. ఈ విషయాన్ని మెజ్దాకు చెప్పుటకు పూజగది వైపు వెళ్ళాను.

అయితే మెజ్దా నా వద్దకే వచ్చాడు. నా చేయి పట్టుకొని, గోడ మీద వేలాడుతున్న ఒక ఫోటో దగ్గరకు తీసుకువెళ్ళాడు. ఆ ఫోటో దగ్గర కొంతసేపు నిలుచున్న తరువాత ఇలా అన్నాడు, “నీవు గుర్తు పట్టలేదా? ఈయనే కదా మనతో మాట్లాడింది?”

నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆయనే, అదే నవ్వు. అయితే ఆయన చనిపోయి చాలా ఏళ్ళయింది. ఇప్పుడు ఆయన ఎలా మన వద్దకు రాగలరు? ఎన్నో సంవత్సరముల క్రితం చనిపోయిన వ్యక్తి మనతో ఎలా మాట్లాడగలరు? అయితే ఆయన మమ్మల్ని ఆశీర్వదించారు; మెజ్దాను కౌగలించుకొని నొసట ముద్దు పెట్టారు. నాకు భయం వేసింది, నోట మాట రాలేదు, నేను మెజ్దా వైపు చూశాను. నేను, మెజ్దా మేమిద్దరము లాహిరీ మహాశయులను చూశాము, మాట్లాడాము, అనుటలో సందేహము లేదు. భారతదేశములోని గృహస్థులు, సాధువులు – అనే భేదము లేకుండా లాహిరీ మహాశయుల ఆశీస్సుల కొరకు, ఆధ్యాత్మిక ఉపదేశాల కొరకు వారి వద్దకు వస్తుండేవారు. మెజ్దాతో కలసి యోగావతారులైన లాహిరీ మహాశయులను నా కళ్ళతో చూశాను, మాట్లాడినాను. ఈ అద్భుత సన్నివేశాన్ని తలచుకొనినప్పుడల్లా, నా ఒళ్ళు జలదరిస్తుంది, గగుర్పాటు కలుగుతుంది. నేను ధన్యుడనయ్యాను, వారి అవధులు లేని కరుణ, దయ నాపై ఉన్నట్లు అనిపిస్తుంది. నా కృతజ్ఞతకు అవధులు లేవు.

Share this on