చివరి సంవత్సరాలు మరియు మహాసమాధి

పరమహంస యోగానందగారి అంతిమ సంవత్సరాలు చాలావరకు ఏకాంతంలోనే గడిచాయి, వారు తమ రచనలను పూర్తి చేయడానికి చాలా శ్రమించారు – భగవద్గీత మరియు క్రీస్తు యొక్క నాలుగు సువార్తలలోని భోధనలపై తమ బృహత్ వ్యాఖ్యానాలతో సహా, అంతకు ముందే రచించిన విస్పర్స్ ఫ్రం ఎటర్నిటీ మరియు యోగదా సత్సంగ పాఠాలను సరిచూడడం జరిగింది. శ్రీ శ్రీ దయామాత, శ్రీ శ్రీ మృణాలినీమాత మరియు కొందరు సన్నిహిత శిష్యులతో ఆయన విస్తృతంగా పని చేశారు, వీరికి ఆధ్యాత్మిక మరియు సంస్థాగత నిర్వహణ అనే అంశాలపై మార్గనిర్దేశన చేశారు తద్వారా, ఆయన పరమపదించిన తరువాత కూడా తన ప్రపంచవ్యాప్త కార్యాన్ని నిర్వహించడం వారికి సాధ్యమయ్యేలా చేశారు.

ఆయన వారితో ఇలా అన్నారు:

నా శరీరము నశించిపోతుంది కానీ నేను తలపెట్టిన కార్యం కొనసాగుతూనే ఉంటుంది. నా స్ఫూర్తి ఎప్పటికీ జీవిస్తూనే ఉంటుంది. నన్ను తీసుకెళ్లినప్పటికీ దైవ సందేశంతో లోక విమోచన కోసం మీ అందరితో కలిసి పని చేస్తాను.

“ఎవరైతే అంతర్గత ఆధ్యాత్మిక సహాయం కోరి సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ కి వస్తారో, వారికి భగవంతుని దగ్గర నుండి అది తప్పక లభిస్తుoది. నేను శరీరంలో ఉన్నపుడు వారు వచ్చినా లేదా తరువాత వచ్చినా ఎస్‌.ఆర్‌.ఎఫ్ గురువుల అనుసంధానంతో భగవంతుడి శక్తి భక్తులలోకి ప్రవహిస్తుంది, మరియు వారి మోక్షానికది కారణం అవుతుంది…..నిత్యజీవులైన బాబాజీ, చిత్తశుద్ధి గల ఎస్‌.ఆర్‌.ఎఫ్ భక్తులకు రక్షణ కల్పించి మరియు వారి పురోగతికి మార్గ నిర్దేశం చేస్తామని హామీ ఇచ్చారు. భౌతిక రూపాలను వదిలేసిన లాహిరీ మహాశయులు, శ్రీయుక్తేశ్వర్ గారు మరియు నా దేహాన్ని వదలిపెట్టిన తరువాత నేను కూడా – అందరమూ కూడా నిజమైన ఎస్.ఆర్.ఎఫ్/వై.ఎస్.ఎస్ సభ్యులను ఎల్లపుడూ రక్షిస్తూ మరియు దారి చూపిస్తూ ఉంటాము.”

యోగానందగారికి భారత రాయబారి భార్య నమస్కారంమార్చి 7, 1952న ఈ గొప్ప గురువు మహాసమాధి చెందారు, అనగా భగవంతుడి దివ్య ప్రకాశం పొందిన ఒక గురువు, చివరిసారి శరీరాన్ని సచేతనంగా విడిచి వెళ్ళడం. అమెరికా సంయుక్త రాష్ట్రాలకు భారత రాయబారియైన డా. బినయ్ ఆర్. సేన్ గారి గౌరవార్ధం లాస్ ఏంజలిస్ లోని బిల్ట్ మోర్ హోటల్లో జరిగిన విందులో చిన్న ప్రసంగాన్ని అప్పుడే పూర్తి చేశారు.

ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళడం ఒక అసాధారణమైన దృగ్విషయంగా గుర్తించబడింది. ఫారెస్ట్ లాన్ మెమోరియల్ పార్క్ డైరెక్టర్ గారు సంతకం చేసిన ప్రామాణిక పత్రంలో ఇలా సూచించబడింది : “చనిపోయిన ఇరవై రోజుల తరువాత కూడ ఆయన భౌతికకాయంలో శారీరక విఘటనం కనబడలేదు….ఇంత పరిపూర్ణమైన శరీర సంరక్షణ మా శవాగార చరిత్రలో మాకు తెలిసినంతవరకు సాటి లేనిది….యోగానందగారి శరీరం అద్భుత నిర్వికార స్థితిలో ఉన్నట్టు కనిపించింది.”

కొద్ది సంవత్సరాల క్రితం పరమహంస యోగానందగారి గురుదేవులైన స్వామి శ్రీ యుక్తేశ్వర్, ఆయనను దైవప్రేమ యొక్క అవతారం అని సంబోధించారు. తదుపరి ఆయన శిష్యులు మరియు మొదటి ఆధ్యాత్మిక వారసులైన రాజర్షి జనకానందగారు ఆయనకు తగిన విధంగా ప్రేమావతారులు లేదా “దైవప్రేమ యొక్క అవతారము” అనే బిరుదును సమర్పించారు.

పరమహంస యోగానందగారి మహాసమాధి యొక్క 25వ వార్షికోత్సవం సందర్భంగా, మానవాళి యొక్క ఆధ్యాత్మిక అభ్యున్నతి కొరకు వారు చేసిన నిర్విరామ కృషికి భారత ప్రభుత్వం అధికారిక గుర్తింపునిచ్చింది. ఒక ప్రత్యేక స్మారక స్టాంపును ఆయన గౌరవార్థం విడుదల చేసింది. దానితోపాటు ప్రచురించిన కరపత్రంలో ఈ కింది విషయాలున్నాయి:

జీవితంలో దేవుని పట్ల ప్రేమ, మానవజాతికి సేవ అనే ఆదర్శాలు పరమహంస యోగానందగారి జీవితంలో పూర్తిగా వ్యక్తమయ్యాయి… వారి జీవితంలో ప్రధాన భాగం భారతదేశానికి వెలుపల గడిచినప్పటికి, మన దేశపు గొప్ప సాదువుల్లో ఆయనకు సముచిత స్థానం ఉంది. పరమాత్మను చేరే ప్రయాణమార్గంలో అన్నిచోట్లా ప్రజలను ఆకర్షిస్తూ, ఆయన ప్రారంభించిన కార్యం అప్రతిహతంగా పెరుగుతూ ప్రకాశిస్తోంది.

'యోగానందగారి స్టాంప్' - భారత ప్రభుత్వం

యోగదా సత్సంగ సొసైటీ 100వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని పోస్టల్ స్టాంప్.2017లో భారతదేశ ప్రధానమంత్రీ, గౌరవనీయులైన నరేంద్ర మోడీ మార్చి 7, 2017న న్యూఢిల్లీలో జరిగిన ఒక ప్రత్యేక కాయక్రమంలో పరమహంసగారికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో యోగదా సత్సంగ సొసైటీ 100వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని కొత్త తపాలా స్టాంపును భారత ప్రభుత్వం విడుదల చేసింది. పరమహంసగారి మహాసమాధి వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈ తేదీని ఎంచుకోవడం జరిగింది.

తన స్ఫూర్తిదాయక ప్రసంగంలో, పరమహంసగారిని భారతదేశపు గొప్ప యోగులు మరియు బోధకులలో ఒకరిగా ప్రధానమంత్రి అభివర్ణించారు—ఆయన జీవితం మరియు కార్యం, ప్రపంచానికి భారతదేశపు ఆధ్యాత్మికత యొక్క బ్రహ్మాండమైన విలువను తెలియజేసిన దృష్టాంతముగా—మరియు ఆధునిక ప్రపంచంలో భారతీయ ప్రాచీన వారసత్వాన్ని పంచుకోవడంలో దాని వ్యవస్థాపకుడి స్ఫూర్తిని, వారసత్వాన్ని విజయవంతముగా కొనసాగిస్తున్నందుకు వై.ఎస్.ఎస్ ను ప్రశంసించారు.

Share this on