యోగశాస్త్ర విశ్వజనీనత

శ్రీ పరమహంస యోగానందగారి
మానవుడి నిత్యాన్వేషణలో “యోగశాస్త్ర విశ్వజనీనత” నుండి సారాంశాలు

మే 21, 1944న కాలిఫోర్నియాలోని హాలీవుడ్‌లోని సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ టెంపుల్‌లో ఇచ్చిన ప్రసంగం. ఇది మరియు పరమహంసగారు చేసిన అనేక ఇతర ఉపన్యాసాలు, మూడు సంపుటాలలో వై‌ఎస్‌ఎస్ ప్రచురించిన ఆయన కలెక్టెడ్ టాక్స్ అండ్ ఎస్సేస్ లో కనిపిస్తాయి.

Paramahansa Yogananda with folded hands

యోగా యొక్క ఉద్దేశ్యం

యోగా అనేది ఆత్మను పరమాత్మతో తిరిగి కలపడానికి శాస్త్రీయ పద్ధతులతో కూడిన వ్యవస్థ. మనము దేవుని నుండి దిగి వచ్చాము మరియు మనము ఆయన వద్దకు తిరిగి వెళ్ళాలి. మనము మన తండ్రి నుండి వేరుపడినట్టుగా బావిస్తునాము, మరియు మనం స్పృహతో ఆయనతో తిరిగి కలవాలి. వేర్పాటు అనే మాయను అధిగమించి భగవంతునితో మన ఏకత్వాన్ని ఎలా గ్రహించాలో యోగా మనకు నేర్పుతుంది. కవి మిల్టన్ మనిషి ఆత్మ గురించి మరియు అది స్వర్గాన్ని ఎలా తిరిగి పొందగలదను దానిగురించి వ్రాసాడు. అదే యోగా యొక్క ఉద్దేశ్యం మరియు లక్ష్యం- ఆత్మ స్పృహ అనే కోల్పోయిన స్వర్గాన్ని తిరిగి పొందడం, దీని ద్వారా మనిషి తాను పరమాత్మతో కలిసి ఉన్నాడని మరియు ఎప్పుడూ అలాగే ఉన్నాడని తెలుసుకొంటాడు.

యోగా: నిజమైన మతం యొక్క శాస్త్రం

ప్రపంచంలోని వివిధ మతాలు మనిషి యొక్క నమ్మకాలపైనే ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి. కానీ మతం యొక్క నిజమైన ఆధారం మన ఏకైక తండ్రైన-దేవుణ్ణి చేరుకోవడానికి భక్తులందరూ ఉపయోగించగల శాస్త్రమై ఉండాలి. యోగమే ఆ శాస్త్రం. మత శాస్త్రం యొక్క అభ్యాసం ఆవశ్యకము. వేర్వేరు పిడివాద “ఇజంలు” మానవాళిని విభజించేలా చేశాయి, అయినప్పటికీ యేసు ఎత్తి చూపారు: “ఒక ఇల్లు తనకు వ్యతిరేకంగా విభజించబడితే, ఆ ఇల్లు నిలబడదు” (మార్కు 3:25). వివిధ మతాలను ఆచరించే వ్యక్తులు తమలో ఉన్న భగవంతుని గురించి తెలుసుకోవడం ద్వారా మాత్రమే వివిధ మతాల మధ్య ఐక్యత ఏర్పడుతుంది. అప్పుడు మనం దేవుని పితృత్వం క్రింద మనిషి యొక్క నిజమైన సోదరభావాన్ని కలిగి ఉంటాము.

ప్రపంచంలోని గొప్ప మతాలన్నీ దేవుణ్ణి కనుగొనవలసిన అవసరాన్ని, మనుషుల మధ్య సోదరభావం గురించి ప్రబోధిస్తాయి; మరియు అందరికీ టెన్ కమ్మండ్మెంట్స్ వంటి నైతిక నియమావళి ఉంటుంది. అయితే, వారి మధ్య విభేదాలను సృష్టించేది ఏమిటి? ఇది మనుషుల మనసులోని మతోన్మాదం. సిద్ధాంతంపై దృష్టి పెట్టడం ద్వారా కాదు, నిజమైన ఆత్మ జ్ఞానం ద్వారా మనం భగవంతుడిని చేరుకోవచ్చు. వివిధ మతాలకు సంబంధించిన సార్వత్రిక సత్యాలను మనుషులు గ్రహించినప్పుడు, పిడివాదం వలన ఎటువంటి ఇబ్బందులు ఉండవు. నాకు యూదుడు, క్రైస్తవుడు, హిందువు లేడు; అందరూ నా సోదరులు. నేను అన్ని దేవాలయాలలో పూజిస్తాను, ఎందుకంటే వాటిలో ప్రతి ఒక్కటి నా తండ్రిని గౌరవించటానికి నిర్మించబడ్డాయి.

సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ ద్వారా ప్రారంభించబడిన ఆలోచనతో ప్రపంచ ఐక్యతను నిర్మించడం ప్రారంభించాలి: “అన్ని మతాల చర్చి”; పరిశీలనాత్మకత కాదు, కానీ అన్ని మతాల దేవుని వద్దకు చెరటానికి వివిధ మార్గాలని గ్రహించి వాటి పట్ల గౌరవం చూపటము. అన్ని మతాలు ఆరాధించే ఒకే దేవునికి అంకితం చేయబడిన ఇటువంటి దేవాలయాలు ప్రతిచోటా నిర్మించబడాలి. ఇది వస్తుందని నేను అంచనా వేస్తున్నాను. తూర్పు మరియు పడమర దేశాల వారు దేవుని గృహాలలోని అల్పమైన విభజనలను శాశ్వతముగా నిర్మూలించాలి. యోగా ద్వారా ఆత్మసాక్షాత్కారం పొంది తద్వారా, మనుషులు తామంతా ఒకే తండ్రి యొక్క పిల్లలమని తెలుసుకుంటారు.

అంధులు అంధులను నడిపించలేరు

ఆత్మ యొక్క ఐక్యత గొప్ప వ్యక్తులలో, దైవసాక్షాత్కారం ఉన్నవారిలో ప్రదర్శించబడుతుంది. అంధులు అంధులను నడిపించలేరు; భగవంతుని గురించి తెలిసిన ఒక గురువు మాత్రమే ఇతరులకు భగవంతుని గురించి సరిగ్గా బోధించగలడు. మన దైవత్వాన్ని తిరిగి పొందాలంటే అటువంటి మాస్టరు లేదా గురువు ఉండాలి. నిజమైన గురువును నమ్మకంగా అనుసరించేవాడు అతనిలా అవుతాడు, ఎందుకంటే గురువు శిష్యుడిని తను ఉన్న సాక్షాత్కార స్థాయికి ఎదగడానికి సహాయం చేస్తాడు. నేను నా గురువు స్వామి శ్రీ యుక్తేశ్వర్‌జీని కనుగొన్నప్పుడు, నేను ఆయన ఉదాహరణను అనుసరించాలని నిర్ణయించుకున్నాను: భగవంతుడిని మాత్రమే నా హృదయ పీఠంపై ఉంచడానికి మరియు ఇతరులతో ఆయనను పంచుకోవడానికి.

లోతైన జ్ఞానాన్ని పొందడానికి సర్వజ్ఞమైన ఆధ్యాత్మిక నేత్రం ద్వారా మన దృష్టిని కేంద్రీకరించాలని హిందూ గురువులు బోధించారు. యోగి కాని వ్యక్తి కూడా ఏకాగ్రతతో పనిచేస్తున్నప్పుడు, కనుబొమ్మల మధ్య బిందువు వద్ద తన నుదురుకు ముడతలు పెడతాడు—ఏకాగ్రత కేంద్రం మరియు ఆత్మ అంతర్ దృష్టికి కేంద్రంగా ఉండే గోళాకార ఆధ్యాత్మిక నేత్రము. అదే నిజమైన “స్ఫటిక బంతి (భవిష్యత్ దర్శిని) ”, దానిలోకే యోగి విశ్వం యొక్క రహస్యాలను తెలుసుకోవడానికి చూస్తాడు. తమ ఏకాగ్రతలో తగినంత లోతుగా వెళ్ళే వారు ఆ “మూడవ” కన్నులోకి చొచ్చుకుపోయి భగవంతుడిని చూస్తారు. కాబట్టి సత్యాన్వేషకులు ఆధ్యాత్మిక నేత్రం ద్వారా తమ గ్రహణశక్తిని ప్రదర్శించే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి. యోగాభ్యాసం సాధకుడికి సహజావబోధన యొక్క ఏకైక కన్ను తెరవడానికి సహాయపడుతుంది.

సహజావబోధన లేదా ప్రత్యక్ష జ్ఞానం ఇంద్రియాల నుండి ఏ ఆధారసామగ్రిపై ఆధారపడి ఉండదు. అందుకే సహజావబోధను తరచుగా “సిక్స్త్ సెన్స్” అని పిలుస్తారు. ప్రతి ఒక్కరికి ఈ సిక్స్త్ సెన్స్ ఉంటుంది, కానీ చాలా మంది దాన్ని అభివృద్ధి చేసుకోరు. ఏది ఏమైనప్పటికీ, దాదాపు ప్రతి ఒక్కరికి ఎప్పుడో ఒకసారి అంతర్ దృష్టి అనుభవం కలిగి ఉంటుంది, బహుశా ఒక నిర్దిష్ట విషయం జరగబోతోందని “భావన”, అది సూచించడానికి ఇంద్రియ సాక్ష్యాలు లేనప్పుడు.

అంతర్ దృష్టిని లేదా ప్రత్యక్ష ఆత్మ జ్ఞానాన్ని పెంపొందించుకోవడం చాలా ముఖ్యం, ఎందుకంటే భగవంతుని చైతన్యం ఉన్నవాడు తనపై తాను ఆత్మవిశ్వాసముతో ఉంటాడు. అతనికి తెలుసు, మరియు అతనికి తెలుసు అని అతనికి తెలుసు. నారింజ పండు యొక్క రుచి మనకు ఎంత ఖచ్చితంగా తెలుసో దేవుని ఉనికి గురించి కూడా అంత ఖచ్చితంగా ఉండాలి. భగవంతునితో ఎలా ఐక్యమవ్వాలో నా గురువు నాకు చూపించిన తర్వాత మరియు ప్రతిరోజూ ఆయన ఉనికిని అనుభవించిన తర్వాత మాత్రమే నేను ఆయన గురించి ఇతరులకు చెప్పడం అనే ఆధ్యాత్మిక బాధ్యతను స్వీకరించాను.

పాశ్చాత్య దేశాలు పెద్ద ఆరాధన ఆలయాలకు ప్రాధాన్యతనిచ్చాయి, అయితే ఆరాధకులకు దేవున్ని ఎలా కనుగొనాలో చూపించేవి చాలా తక్కువ. తూర్పున, దేవుని-సాక్షాత్కారానికి సంబంధించిన వ్యక్తుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వబడింది; కానీ వారు చాలా సందర్భాలలో ఆధ్యాత్మిక అన్వేషకులకు అందుబాటులో ఉండరు, మారుమూల మరియు ఏకాంత నివాసాలలో ఏకాంతంలో ఉంటారు. ప్రజలు దేవునితో అనుసందానము చేసే ఆధ్యాత్మిక కేంద్రాలు మరియు అలా అనుసందానం ఎలా చేయాలో ప్రజలకు చూపించగల ఉపాధ్యాయులు రెండూ అవసరం. భగవంతుని గురించి తెలియని గురువు నుండి భగవంతుని గురించిన జ్ఞానాన్ని ఎలా పొందగలము? దివ్య తండ్రి గురించి ఇతరులకు చెప్పడానికి ప్రయత్నించే ముందు ఆయన గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకతను నా గురువు నాపై ముద్రవేశారు. ఆయన నుండి శిక్షణ పొందినందుకు నేను ఎంత కృతజ్ఞుడను! ఆయన నిజంగా దేవునితో అనుసందానములో ఉండేవారు.

భగవంతుడిని ముందుగా తన సొంత దేహమనే దేవాలయంలో గ్రహించాలి. ప్రతి సాధకుడు తన ఆలోచనలను ప్రతిరోజూ క్రమశిక్షణలో ఉంచుకోవాలి మరియు అతని ఆత్మ పీఠంపై తన భక్తి యొక్క వన్యపుష్పాలను ఉంచాలి. తనలోని భగవంతుడిని కనుగొన్న వ్యక్తి తాను ప్రవేశించిన ప్రతి చర్చిలో లేదా దేవాలయంలో ఆయన ఉనికిని అనుభవించగలడు.

యోగా వేదాంతాన్ని ఆచరణాత్మక అనుభవంగా మారుస్తుంది

యోగా అన్ని మతాలలోని సత్యాన్ని మనిషి గ్రహించేలా చేస్తుంది. ద టెన్ కమ్మండ్మెంట్స్ (పది ఆజ్ఞలు) వివిధ పదాలలో, ప్రతి మతంలోను బోధించబడ్డాయి. కానీ యేసు నొక్కిచెప్పిన రెండు గొప్ప ఆజ్ఞలు: “నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణమనస్సుతోను నీ ప్రభువైన దేవుడును ప్రేమించుము,” మరియు “నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము” (మత్తయి 22:37, 39).

దేవుణ్ణి “నీ పూర్ణమనస్సుతో” ప్రేమించడం అంటే ఇంద్రియాల నుండి ఒకరి దృష్టిని ఉపసంహరించుకోవడం మరియు ఆ శ్రద్ధను దేవునికి ఇవ్వడం; ధ్యానంలో ఒకరి పూర్తి ఏకాగ్రతను ఆయనకు ఇవ్వడం. భగవంతుని అన్వేషించే ప్రతి ఒక్కరూ ఏకాగ్రత నేర్చుకోవాలి. మనస్సు యొక్క అంతరంలో ఇతర విషయాల గురించి ఆలోచిస్తూ అదే సమయంలో ఒకరు చేసే ప్రార్థన నిజమైన ప్రార్థన కాదు మరియు భగవంతుడు ఆ ప్రార్దనను పట్టించుకోడు. ఆ తండ్రిని కనుగొనాలంటే ముందుగా తన పూర్తి మనస్సుతో, మరియు ఏక దృష్టి ఉన్న ఏకాగ్రతతో ఆయనను వెతకాలని యోగా బోధిస్తుంది.

యోగా అందరి కోసం

హిందువులు యోగాభ్యాసానికి ఎక్కువ సమర్థమైన వారని, పాశ్చాత్యులకు యోగా సరిపోదని కొందరు అంటున్నారు. ఇది నిజం కాదు. అనేక మంది పాశ్చాత్యులు ప్రస్తుతం యోగాను అభ్యసించడానికి చాలా మంది హిందువుల కంటే మెరుగైన స్థితిలో ఉన్నారు, ఎందుకంటే శాస్త్రీయ పురోగతి పాశ్చాత్యులకు చాలా ఖాళీ సమయాన్ని ఇచ్చింది. జీవితాన్ని సులభతరం చేయడానికి మరియు ఎక్కువ ఖాళీ సమయాన్ని పొందటానికి భారతదేశం పశ్చిమ దేశాల ప్రగతిశీల భౌతిక పద్ధతులను మరింత ఎక్కువగా ఉపయోగించుకోవాలి; మరియు పాశ్చాత్యులు భారతదేశం నుండి యోగా యొక్క ఆచరణాత్మక అధిభౌతిక పద్ధతులను తీసుకోవాలి దీని ద్వారా ప్రతి మనిషి దేవుని దగ్గరకు తన మార్గాన్ని కనుగొనవచ్చు. యోగా అనేది ఒక శాఖ కాదు కానీ విశ్వవ్యాప్తంగా వర్తించే శాస్త్రం, దీని ద్వారా మనం మన తండ్రిని కనుగొనవచ్చు.

యోగా అనేది ప్రతి ఒక్కరికీ, పాశ్చాత్య ప్రజల కోసం మరియు తూర్పు ప్రజల కోసం. టెలిఫోన్ పాశ్చాత్య దేశాలలో కనిపెట్టినంత మాత్రాన తూర్పు దేశానికి చెందినది కాదని ఎవరూ అనరు. అదేవిధంగా, యోగా యొక్క పద్ధతులు, తూర్పున అభివృద్ధి చెందినప్పటికీ, అవి తూర్పుకు మాత్రమే కాకుండా సమస్త మానవాళికి ఉపయోగపడతాయి.

మనిషి ఇండియాలో పుట్టినా, అమెరికాలో పుట్టినా ఏదో ఒక రోజు చనిపోవాల్సిందే. సెయింట్ పాల్ లాగా దేవునిలో “రోజువారీ చనిపోవడం” ఎందుకు నేర్చుకోకూడదు? (I కొరింథీయులు 15:31) యోగా ఆ పద్ధతిని బోధిస్తుంది. మనిషి శరీరంలో ఖైదీగా జీవిస్తాడు; అతని పదవీకాలం ముగిసినప్పుడు, అతను బయటకు విసిరివేయబడటము అనే అవమానానికి గురవుతాడు. శరీరాన్ని ప్రేమించడం అంటే జైలును ప్రేమించడం తప్ప మరొకటి కాదు. శరీరంలో జీవించడానికి చాలా కాలంగా అలవాటుపడిన మనం నిజమైన స్వేచ్ఛ అంటే ఏమిటో మర్చిపోయాము. పాశ్చాత్యుడివి అయినందున స్వేచ్ఛను కోరుకోగూడదు అనటము సబబు కాదు. ప్రతి మనిషికి అతను తన ఆత్మను కనుగొనడం మరియు అతని అమర స్వభావాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం. యోగా ఆ మార్గాన్ని చూపుతుంది.

ఆత్మ దేవుని వద్దకు తిరిగి వెళ్ళాలి

సృష్టికి ముందు విశ్వ చైతన్యం ఉంది: ఆత్మ లేదా దేవుడు, సంపూర్ణమైన, నిత్యము ఉనికిలో ఉన్న, నిత్య-చేతన, రూపం మరియు అభివ్యక్తికి మించిన నిత్య నవీన ఆనందం. సృష్టి ఉనికిలోకి వచ్చినప్పుడు, విశ్వ చైతన్యం భౌతిక విశ్వంలోకి “అవరోహించింది”, అక్కడ అది క్రీస్తు చైతన్యంగా వ్యక్తమవుతుంది: భగవంతుని జ్ఞానము మరియు చైతన్యం యొక్క సర్వవ్యాప్త స్వచ్ఛమైన ప్రతిబింబం అంతర్లీనంగా మరియు సంపూర్ణంగా సృష్టిలో దాగి ఉంది. క్రీస్తు చైతన్యం మనిషి యొక్క భౌతిక శరీరంలోకి అవరోహించినప్పుడు అది ఆత్మ లేదా అతీతమైన చైతన్యంగా మారుతుంది: నిత్యము ఉనికిలో ఉన్న, నిత్యము చైతన్యములో ఉన్న, శరీరంలో బంధించడం ద్వారా వ్యక్తిగతీకరించబడిన భగవంతుని యొక్క నిత్య-నవీన ఆనందం. ఆత్మ శరీరంతో గుర్తించబడినప్పుడు, అది అహంకారంగా, మర్త్య చైతన్యంగా వ్యక్తమవుతుంది. పరమాత్మ చైతన్యము యొక్క నిచ్చెనను తిరిగి ఎక్కాలని ఆత్మకు యోగా బోధిస్తుంది.

గమనిక: మనిషి యొక్క జీవితం మరియు దైవ చైతన్యం – ఆత్మ యొక్క నివాసం – మెదడులోని సూక్ష్మ ఆధ్యాత్మిక కేంద్రాలలో ఉందని యోగా బోధిస్తుంది: సహస్రారం, మెదడు పైభాగంలో ఉన్న వెయ్యి రేకుల కమలం, విశ్వ చైతన్యం యొక్క స్థానం; కుటస్థ,కనుబొమ్మల మధ్య బిందువు వద్ద, క్రీస్తు చైతన్యం యొక్క స్థానం; మరియు మెడ్యూల్లరీ సెంటర్ (కుటస్థకు ధ్రువణతతో అనుసంధానించబడింది), అతీతమైన చైతన్యం (సూపర్ కాన్షియస్‌నెస్) యొక్క స్థానం. ఈ అత్యున్నత ఆధ్యాత్మిక గ్రహణ కేంద్రాల నుండి శరీరంలోకి (మరియు శరీర-చైతన్యంలోకి) అవరోహణ జరుగుతూ, ప్రాణశక్తి మరియు చైతన్యం వెన్నెముక ద్వారా క్రిందికి ప్రవహిస్తుంది, ఐదు సూక్ష్మ వెనుభాగ కేంద్రాల గుండా వెళుతుంది మరియు భౌతిక అవయవాల యొక్క జీవితం, ఇంద్రియ గ్రహణశక్తి మరియు ఇంద్రియ చర్యలో బయటికి శాఖలుగా వెలుతుంది.

భగవంతునితో తన ఏకత్వం యొక్క ఆనందకరమైన సాక్షాత్కారాన్ని తిరిగి పొందడానికి, మనిషి యొక్క ఆత్మ దాని దిగువ ప్రయాణమునకు వ్యతిరేకముగా పయకు ప్రయాణించాలి, పవిత్రమైన వెన్నెముక మార్గం ద్వారా దైవిక అవగాహన యొక్క ఉన్నత మస్తిష్క కేంద్రాలలోని తన ఇంటికి చేరుకోవాలి. యోగద సత్సంగ పాఠాలలో, గురువు-ఇచ్చిన శాస్త్రీయ యోగ ధ్యాన పద్ధతుల అభ్యాసం ద్వారా ఇది సాధించబడుతుంది.

ఆనందం యొక్క రహస్యం భగవంతుని ఉనికి యొక్క చేతన

జీవితాన్ని ఆస్వాదించడం సరైందే; ఆనందం యొక్క రహస్యం దేనికీ ఆకర్షితమై ఉండకపోవటం. పువ్వు వాసనను ఆస్వాదించండి, కానీ దానిలో భగవంతుడిని చూడండి. నేను ఇంద్రియాల చైతన్యమును ఉంచాను ఎందుకంటే, వాటిని ఉపయోగించి నేను ఎల్లప్పుడూ భగవంతుడిని అనుభవించి, ఆయన గురించి ఆలోచించటానికే. “నా కళ్ళు ప్రతిచోటా నీ అందాన్ని చూడడానికి చేయబడ్డాయి. సర్వవ్యాపకమైన నీ స్వరాన్ని వినడానికి నా చెవులు చేయబడ్డాయి.” ఇదియే యోగా, భగవంతునితో ఐక్యం. ఆయనను కనుగొనడానికి అడవికి వెళ్లవలసిన అవసరం లేదు. ప్రాపంచిక అలవాట్లు మనం ఎక్కడ ఉన్నా వాటి నుండి మనల్ని మనం విడిపించుకునే వరకు మనల్ని గట్టిగా పట్టుకుంటాయి. యోగి తన హృదయ గుహలో భగవంతుడిని కనుగొనడం నేర్చుకుంటాడు. అతను ఎక్కడికి వెళ్లినా, తనతో పాటు భగవంతుని ఉనికి యొక్క ఆనందకరమైన చైతన్యమును తీసుకువెళతాడు.

మనిషి మర్త్య ఇంద్రియ చైతన్యములోకి దిగడమే కాకుండా, దురాశ, కోపం మరియు అసూయ వంటి ఇంద్రియ చైతన్యముల యొక్క అసాధారణతలకు కట్టుబడి పోయాడు. భగవంతుడిని కనుగొనడానికి మనిషి ఈ అసాధారణతలను బహిష్కరించాలి. తూర్పు మరియు పాశ్చాత్య దేశీయులు ఇద్దరూ ఇంద్రియ బానిసత్వం నుండి విముక్తి పొందాలి. ఒక సాధారణ వ్యక్తి తన ఉదయం కాఫీ తన వద్దకు తీసుకురానందున కోపం తెచ్చుకోవచ్చు మరియు దాని లేమి అతనికి ఖచ్చితంగా తలనొప్పిని ఇస్తుందని అతను బావిస్తాడు. అతను తన అలవాట్లకు బానిస. అభివృద్ధి చెందిన యోగి స్వేచ్ఛగా ఉంటాడు. ఇప్పుడు వారు ఉన్న చోటే ప్రతి ఒక్కరు యోగి కావచ్చు. కానీ మనం మన స్వంత జీవిత అలవాట్లకు మించిన దాన్ని గురించి వింత మరియు కష్టమైనదని ఆలోచించే అవకాశం ఉంది. మన అలవాట్లు ఇతరులకు ఎలా కనిపిస్తాయో మనం పరిగణించము!

యోగాభ్యాసం స్వేచ్ఛకు దారి తీస్తుంది. కొంతమంది యోగులు విపరీతమైన వైరాగ్యపు ఆలోచనను కలిగి ఉంటారు. వారు అసౌకర్యం లేకుండా మేకుల మంచం మీద పడుకోగలగాలని మరియు ఇతర రకాల తపస్సు, శారీరక క్రమశిక్షణ బోధిస్తారు. మేకుల మంచం మీద కూర్చుని భగవంతుని తలచుకోగలిగినవాడు గొప్ప బుద్ధిబలాన్ని చూపిస్తాడన్నది నిజం. కానీ అలాంటి ఫీట్లు అవసరం లేదు. ఒక సౌకర్యవంతమైన కుర్చీలో కూర్చుని భగవంతుని ధ్యానం చేయవచ్చు.

వెన్నెముకను నిటారుగా ఉంచే ఏ భంగిమైనా ధ్యానం మరియు భగవంతునిపై యోగ ఏకాగ్రత కోసం సరిపోతుందని పతంజలి బోధించారు. హత యోగలో సూచించినట్లుగా,కష్టమైన శారీరక బంగిమలు ద్వారా వెళ్లడం లేదా అసాధారణమైన శారీరక సున్నితత్వం మరియు ఓర్పు అవసరమయ్యే వ్యాయామాలు చేయడం అవసరం లేదు. దేవుడు మి లక్ష్యం; ఆయన ఉనికిని గురించిన సచేతనత్వం కొరకే మనం పని చేయాలి. భగవద్గీత ఇలా చెబుతోంది: “ఎవరైతే తనని తాను నాలో శోషించు కుంటాడో, అతని ఆత్మని నాలో నిమజ్జనం చేసుకుని ఉంటాడో, నేను అతనిని అన్ని వర్గాలలో (యోగులలో) అత్యంత సమతుల్యునిగా పరిగణిస్తాను” (VI:47).

హిందూ యోగులు తీవ్రమైన వేడి మరియు చలి, మరియు దోమలు మరియు ఇతర బాధించే కీటకాల పట్ల ఉపేక్షను ప్రదర్శిస్తారు. అటువంటి ప్రదర్శన యోగిగా ఉండడానికి అవసరం లేదు, కానీ అది ప్రవీణుల సహజ కార్య సిద్ధి. అవాంతర అంశాలను తొలగించడానికి ప్రయత్నించండి; లేదా అవసరమైతే, వాటి ద్వారా అంతర్గతంగా కలవరపడకుండా వాటిని భరించండి. ఎవరైనా శుభ్రంగా ఉండగలిగితే, మురికిగా ఉండడానికి అర్ధం లేదు. ఒకరు ఒక గుడిసెలో నివసించడానికైనా అలాగే రాజభవనంలో నివసించడానికైనా అలవాటుపడవచ్చు.

ఆధ్యాత్మిక విజయాన్ని సాధించడంలో గొప్ప అంశం సంకల్పం. యేసు చెప్పాడు, “కోత నిజంగా పుష్కలంగా ఉంది, కానీ కూలీలు తక్కువ” (మత్తయి 9:37). ప్రపంచంలోని ప్రజలు భగవంతుని బహుమతులను కోరుకుంటారు, కానీ జ్ఞానవంతుడు ఆ దాతనే కోరుకుంటాడు.

యోగిగా ఉండటమంటే ధ్యానం చేయడమే. యోగి ప్రతి ఉదయం నిద్రలేచిన తర్వాత తన శరీరానికి ఆహారం గురించి ముందుగా ఆలోచించడు; అతను తన ఆత్మకు భగవంతుని అనుసందానము అనే అమృతాన్ని ఆహారంగా ఇస్తాడు. ద్యానంలో లోతుగా మునిగిన మనస్సులో కనుగొన్న ప్రేరణతో అతన నింపబడి, అతను రోజులోని అన్ని విధులను సంతోషంగా నిర్వహించగలుగుతాడు.

దేవుడు ఈ భూమిని ఇలా, ఉద్దేశపూర్వకంగానే చేశాడు; ఆయన ప్రణాళికలో ప్రపంచాన్ని మెరుగుపరచడం మనిషి యొక్క భాగం. పాశ్చాత్యులు కొత్త మరియు మెరుగైన భౌతిక సౌకర్యాలను పొందడంకొరకు నిరంతరం తీరికలేకుండా ఉండటంలో తీవ్రస్థాయికి వెళతారు. తూర్పు దేశస్థుడు తన వద్ద ఉన్నదానితో సంతృప్తి చెందడంలో అత్యధికమైన సంతృప్తి స్థితికి వెళ్తాడు. పశ్చిమం యొక్క ముందుకు-సాగే స్పూర్తి మరియు తూర్పు యొక్క సులభమైన, ప్రశాంతమైన స్ఫూర్తి రెండింటిలోనూ ఆకర్షణీయంగా ఏదో ఉంది. మనము ఈ రెంటి మధ్య ఉన్న సమతుల్య రహదారిని తీసుకోవాలి.

ధ్యానం యోగిని చేస్తుంది

భగవంతుడిని కనుగొనడానికి, ప్రతిరోజూ ఉదయం మరియు రాత్రి ద్యానం చేయాలి, మరియు పగటిపూట కొంచెం ఖాళీ సమయం ఉన్నప్పుడల్లా ధ్యానం చేయాలి. అదనంగా, వారంలో ఒక రోజు ఆరు గంటలు ధ్యానం చేయడం ముఖ్యం. ఇది అసమంజసమైనది కాదు; కొందరు వ్యక్తులు వారంలో ప్రతిరోజూ పది గంటలు పియానోపై సాధన చేస్తారు, మరియు దాని గురించి పెద్దగా ఆలోచించరు. ఆధ్యాత్మిక నైపున్యుడిగా మారడానికి, భగవంతుడికి ఎక్కువ సమయం ఇవ్వడం అవసరం. మనం ఆయనను అన్నిటికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నామని ఆయన భావించేలా చేయాలి. మీరు ధ్యానంలో అనుభవజ్ఞులైనప్పుడు, అతీతమైన చైతన్యంలోకి`1 (సూపర్ కాన్షస్‌నెస్‌లోకి) లోతుగా వెళ్లగలిగినప్పుడు, ఐదు గంటల నిద్ర సరిపోతుంది. మిగిలిన రాత్రి ధ్యానం కోసం ఉపయోగించాలి. భగవంతుని ధ్యానించడానికి రాత్రులు మరియు తెల్లవారుజాము మరియు సెలవు దినాలను ఉపయోగించవచ్చు. ఈ విధంగా ఎవరైనా, పనిలో ఎక్కువగా నిమగ్నమయి ఉండే పాశ్చాత్యులు కూడా యోగిగా మారవచ్చు. కాబట్టి పాశ్చాత్య యోగి అవ్వండి అందుకు మీరు తలపాగా ధరించాల్సిన అవసరం లేదు లేక నా లాంటి పొడవాటి జుట్టు కలిగి ఉండాల్సిన అవసరం లేదు!

మనకు చర్చిల “తేనెపట్టులు” అవసరం, కానీ మన స్వంత స్వీయ-సాక్షాత్కారం యొక్క “తేనె”తో చర్చిలను కూడా నింపాలి. దేవుడు చర్చిలలో కూడా ఉన్నాడు; కానీ మీరు కేవలం అక్కడికి వెళ్లడం ద్వారా తనను తాను చూపించమని ఆయనను ఒప్పించలేరు. చర్చికి వెళ్లడం మంచిది, కానీ రోజువారీ ధ్యానం ఇంకా మంచిది. రెండింటినీ చేయండి, ఎందుకంటే మీరు చర్చికి వెళ్లడంతో ఖచ్చితంగా ప్రేరణ పొందుతారు; మరియు రోజువారీ ధ్యానం నుండి మీరు మరింత గొప్ప ఉద్ధరణను పొందుతారు. ఒక భక్తుని హృదయం తపిస్తున్నప్పుడు మరియు ప్రార్థన తర్వాత ప్రార్థనల గుల్లను ప్రయోగించినపుడు దేవుడు ఆ భక్తుడికి లొంగిపోతాడు. ఆయనను కనుగొనడానికి ఆ ఎడతెగని భక్తి చాలా అవసరం. యోగిగా ఉండి నేటికీ ఆధునిక ప్రపంచానికి అనుగుణంగా నడుచుకోవాలంటే ఇంట్లో ధ్యానంచేయటము, తనని తాను క్రమశిక్షణలో పెట్టుకోవటము, మరియు భగవంతుని సేవ అనే దృక్పథంతో అన్ని విధులను నిర్వహించడం అవసరం.

మనుష్యుల ఆత్మలలో దేవుని ఆలయాలను నిర్మించాలనేది నా గొప్ప కోరిక; మరియు మనుష్యుల ముఖాలలో దేవుని చిరునవ్వు చూడటము. జీవిత సాఫల్యాలలో అతి ముఖ్యమైనది ఎవరికి వారు వారి ఆత్మలో దేవుని ఆలయాన్ని స్థాపించడం. మరియు ఇది సులభంగా చేయవచ్చు. అందుకే సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ పశ్చిమ దేశాలకు పంపబడింది.

ఎవరైతే తన ఆత్మ దేవాలయంలో భగవంతుడిని స్థాపించారో వారు యోగియే. అతను నాతో, చెప్పగలడు, యోగా అనేది తూర్పు, ఉత్తరం, దక్షిణం మరియు పడమరల ప్రజలందరి కోసం అని, మరియు వారు యోగా యొక్క రాజమార్గంలో చేరడానికి వేదాంత మార్గాన్ని అనుసరించాలని. సరైన రహదారి దేవుని ఆనందం యొక్క రాజభవనానికి చేరుస్తుంది. ఒకసారి అక్కడికి చేరుకున్నవాడు “ఇక బయటికి వెళ్ళడు” (ప్రకటన 3:12).

తదుపరి అన్వేషణ కోసం

Share this on