ఇతరుల కోసం ఎలా ప్రార్థించాలి

ఇతరుల కోసం ఎలా ప్రార్థించాలో వివరిస్తున్న శ్రీ దయామాత“ఆలోచన ఒక శక్తి; దానికి అపారమైన శక్తి ఉంది. అందుకే పరమహంస యోగానందగారు ప్రారంభించిన ప్రపంచవ్యాప్త ప్రార్థనా కూడలిని నేను చాలా లోతుగా నమ్ముతాను. మీరందరూ ఇందులో పాలుపంచుకున్నారని ఆశిస్తున్నాను. ప్రపంచవ్యాప్త ప్రార్థనా కూడలిని ఉపయోగించే స్వస్థత ప్రక్రియలో వలె ప్రజలు శాంతి, ప్రేమ, సద్భావన, క్షమాపణ వంటి ఏకాగ్రత, సానుకూల ఆలోచనలను పంపినప్పుడు, ఇది గొప్ప శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఎక్కువ మంది ఇలా చేస్తే, అది ప్రపంచాన్ని మార్చగల శక్తివంతమైన సద్భావపు ప్రకంపనను ఏర్పాటు చేస్తుంది.”

—శ్రీ దయామాత

మన ప్రార్థనలు ఇతరుల జీవితాలను ఎలా ప్రభావితం చేయగలవు? మన జీవితాలను ఉద్ధరించే విధంగానే: చైతన్యంలో ఆరోగ్యం, విజయం మరియు దివ్య సహాయాన్ని గ్రహించగలిగే సానుకూల ఆదర్శాలను నాటటం ద్వారా. పరమహంస యోగానందగారు ఇలా వ్రాశారు:

“మానవ మనస్సు, ఆటంకాలు లేదా చంచలత్వం యొక్క ‘జఢత్వం’ నుండి విముక్తి పొందింది, సంక్లిష్టమైన రేడియో యంత్రాంగం యొక్క అన్ని విధులను నిర్వహిస్తున్న విధంగా – ఆలోచనలను పంపడం, స్వీకరించడం మరియు అవాంఛనీయమైన వాటిని శృతి చేయకపోవటం వంటివి చేయగలదు. రేడియో ప్రసార కేంద్రం యొక్క శక్తి అది ఉపయోగించగల విద్యుత్ ప్రవాహం ద్వారా నియంత్రించబడుతుంది, అలాగే మానవ రేడియో యొక్క సార్థకత ఆ వ్యక్తి యొక్క సంకల్పశక్తి స్థాయిపై ఆధారపడి ఉంటుంది.”

భగవంతుని చిత్తంతో తమ చిత్తాన్ని సంపూర్ణంగా అనుసంధానించుకున్న తేజోమూర్తులైన గురువుల మనస్సులు, శరీరం, మనస్సు మరియు ఆత్మ యొక్క తక్షణ స్వస్థతను తీసుకురావడానికి దివ్యశక్తిని ప్రసారం చేయగలవు. పరమహంస యోగానందగారి రచనలు మరియు ఉపన్యాసాలు అటువంటి స్వస్థత యొక్క ఉదాహరణలతో పుష్కలంగా నిండి ఉన్నాయి. అవి అద్భుతంగా అనిపించినప్పటికీ, దివ్య-స్వస్థతలు సృష్టి యొక్క సార్వత్రిక నియమాలను శాస్త్రీయంగా నెరవేర్చడం వల్ల కలిగే సహజ ఫలితం అని ఆయన వివరించారు. ఇతరుల మనస్సులలో మరియు శరీరాలలో వాటిని వ్యక్తీకరించడానికి తగినంత సంకల్పశక్తి మరియు బలంతో దేవుని పరిపూర్ణతా ఆలోచన నమూనాలను అందించటం ద్వారా, విశ్వంలోని ప్రతిదీ ఏ ప్రక్రియ ద్వారా ఏర్పడిందో ఈ జ్ఞానులు అదే విధానాన్ని అనుసరించి నెరవేరుస్తారు.

ఈ సూత్రాల ప్రకారం ప్రార్థన చేసే ఏ వ్యక్తి అయినా తన ప్రార్థనలు కూడా స్పష్టమైన ప్రభావాన్ని కలిగి ఉంటాయని కనుగొంటారు. మరియు మన వ్యక్తిగత శక్తి స్పష్టంగా ఒక గురువు పంపిన దానికంటే తక్కువగా ఉన్నప్పటికీ, వేలాది మంది ప్రార్థనలు ఏకమైనప్పుడు, శాంతి మరియు దివ్య స్వస్థత యొక్క శక్తివంతమైన ప్రకంపనలు ఆశించిన ఫలితాలు వ్యక్తమవటానికి సహాయపడటంలో అమూల్యమైన విలువను కలిగి ఉంటాయి. ఈ క్రమంలో, పరమహంస యోగానందగారు యోగద సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ ప్రార్థనా కూటమి మరియు ప్రపంచవ్యాప్త ప్రార్థనా కూడలిని ప్రారంభించారు.

ఇతరుల కోసం ప్రభావవంతంగా ప్రార్థించడానికి పరమహంసగారి ప్రక్రియలలో ఒకటి:

వీల్ చైర్ పై ఉన్న వ్యక్తితో శ్రీ పరమహంస యోగానంద.“మొదట, మీ కనుబొమ్మలను కొద్దిగా ముడవండి, ఆపై మీ కళ్ళు మూసుకోండి. మీరు స్వస్థత చేసే శక్తిని ఎవరికి పంపాలనుకుంటున్నారో ఆలోచించండి.

“మీ కనుబొమ్మల మధ్య బిందువు వద్ద ఏకాగ్రతతో ఉండండి మరియు మానసికంగా ఇలా చెప్పండి: ‘దివ్యమైన తండ్రీ, నేను నీ సంకల్పంతో సంకల్పిస్తాను. నీ సంకల్పమే నా సంకల్పం. నీ సర్వవ్యాపక సంకల్పంతో, ఓ తండ్రీ, ఈ వ్యక్తి స్వస్థత పొందాలని నేను నా పరిపూర్ణ హృదయంతో, నా పూర్ణాత్మతో కోరుకుంటున్నాను.’

ఇలా చెబుతున్నప్పుడు, మీ కనుబొమ్మల మధ్య ఉన్న బిందువు ద్వారా మీరు సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తి కనుబొమ్మల మధ్య ఉన్న బిందువులోకి ప్రవాహం వెళుతుందని భావించండి. మీరు స్వస్థత పొందాలనుకునే వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక నేత్రంలోకి మీ ఆధ్యాత్మిక నేత్రం నుండి ప్రవాహం పంపుతున్నట్లు భావించండి.

గాఢంగా కేంద్రీకరించండి మరియు మీరు కనుబొమ్మల మధ్య బిందువు వద్ద వేడిని అనుభవిస్తారు. ఈ వేడిని అనుభవించడం మీ సంకల్ప శక్తి అభివృద్ధి చెందుతుందనడానికి రుజువు.

“ఇంకా గాఢమైన ఏకాగ్రత పెట్టండి. మానసికంగా ఇలా చెప్పండి: ‘నీ సంకల్ప బలంతో నేను మెఱుపులా విశ్వశక్తిని పంపుతాను, తండ్రీ’.

“ఇది పదిహేను నుండి ఇరవై నిమిషాల వరకు సాధన చేయాలి. మీరు దీన్ని చేస్తున్నప్పుడు, మీ సంకల్ప శక్తి అభివృద్ధి చెందుతుంది; మరియు అవసరమైనప్పుడు మీకు మరియు ఇతరులకు సహాయం చేయడానికీ, ఏమి జరిగినప్పటికీ, ఈ అభివృద్ధి చెందిన సంకల్ప శక్తి నిరంతరం మీతోనే ఉంటుంది.”

నా ప్రార్థనలు ఇతరులకు ఎలా సహాయపడగలవు?

శ్రీ దయామాత

సమయం: 4:26 నిమిషాలు

శ్రీ దయామాత: వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. మూడవ అధ్యక్షురాలు.కొన్నిసార్లు జనులు ఇలా అడుగుతారు, “ఇతరుల కోసం ప్రార్థించడానికి ఉత్తమ మార్గం ఏమిటి?” శ్రీ శ్రీ దయామాత ఇలా చెప్పారు:

“ఇతరుల కోసం ప్రార్థించడం సరైనది మరియు మంచిది…అన్నిటికంటే ముఖ్యం, వారు దేవుణ్ణి విశ్వసించి, దివ్య-వైద్యుని నుండి నేరుగా శారీరక, మానసిక లేదా ఆధ్యాత్మిక సహాయాన్ని పొందాలని కోరడం. ఇది అన్ని ప్రార్థనలకు ఆధారం. దేవుని ఆశీర్వాదం ఎప్పుడూ ఉంది; గ్రహణశక్తి తరచుగా లోపిస్తుంది. ప్రార్థన గ్రహణశక్తిని పెంచుతుంది….

“మీరు ఇతరులకు లేదా మీ కోసం స్వస్థతను ధృవీకరిస్తున్నప్పుడు, దేవుని స్వస్థత యొక్క అద్భుతమైన శక్తిని తెల్లటి కాంతిగా మీ చుట్టూ లేదా మీరు ప్రార్థిస్తున్న వ్యక్తి చుట్టూ ఊహించుకోండి. అన్ని అనారోగ్యాలు మరియు అసంపూర్ణతలు అందులో కరిగిపోతున్నాయని భావించండి. మనం ఆలోచించే ప్రతి ఉన్నతమైన ఆలోచన, మనం చేసే ప్రతి ప్రార్థన, మనం చేసే ప్రతి మంచి పని దేవుని శక్తితో నిండి ఉంటుంది. మన విశ్వాసం బలపడినకొద్దీ, దేవునిపై మన ప్రేమ మరింత లోతుగా మారినకొద్దీ మనం ఈ శక్తిని మరింత గొప్ప గొప్ప మార్గాల్లో వ్యక్తపరచగలము.”

ప్రార్థన ద్వారా ప్రపంచ శాంతిని మరియు స్వస్థతను తీసుకురావడానికి మీరు ఎలా సహాయపడగలరు

Share this on