గురు పూర్ణిమ – 2013

ఈ సంవత్సరం జూలై 22న వచ్చే గురు పూర్ణిమ సందర్భంగా మన గౌరవనీయమైన సంఘమాత

శ్రీ శ్రీ మృణాళినీమాత నుండి ప్రత్యేక సందేశం

ప్రియతములారా,

జూలై 22, 2013

యుగయుగాలుగా, ఆత్మలను తిరిగి తన వద్దకు తీసుకురావాలని హృదయపూర్వకంగా కోరుకునే దైవానికి దేవదూత అయిన గురువుకు భారతదేశంలోని భక్తులు నివాళులు అర్పించారు. ఆ సంప్రదాయానుసారంగా పవిత్రమైన గురు పూర్ణిమ రోజున, మన గురుదేవులైన శ్రీ శ్రీ పరమహంస యోగానందగారికి మన హృదయపూర్వక కృతజ్ఞతలు సమర్పించడం ద్వారా, మనను మానవ స్పృహ నుండి దివ్య చైతన్యంలోకి ఉద్ధరించగలిగే వ్యక్తికి ఆకర్షించబడే అమూల్యమైన బహుమతిపై కొత్తగా ఆలోచన చేసే అవకాశం మనకు కలుగుతుంది. ఆత్మసాఫల్యాన్వేషణలో పరిమితమైన మన ఇంద్రియ-బంధిత మనస్సు ఈ ప్రపంచంలోని వైవిధ్యాల వలన మరియు మన అనుభూతిపై మాయ ప్రభావం వలన అనేక విభిన్న దిశలలో లాగబడుతుంది. కానీ నిజమైన గురువు సహాయంతో, మార్గం సూటిగా మరియు స్పష్టంగా మారుతుంది, అందువలన మన అంతిమ విజయం ఖాయమవుతుంది.

గురుదేవులు మనకు ఇలా చెప్పారు, “గురువు చెప్పేది వినడం అనేది శిష్యుడిని అత్యున్నత లక్ష్యానికి చేర్చే కళ.” తన సర్వవ్యాప్త ప్రేమ మరియు జ్ఞానంతో, ఆయన తన పాదాల వద్ద ఆశ్రయం పొందిన ప్రతి ఆత్మను అందుకుంటాడు; ఆయన మార్గదర్శకత్వం మరియు దయను మనం పూర్తి స్థాయిలో అందుకోవడానికి, మరింత లోతైన స్థాయిలో వినగలిగే సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం మన పని. మన శ్రద్ధ లోపిస్తే, ఆయన మాటల నుండి పొందిన ప్రేరణ రోజువారీ జీవితంలోని ఆందోళనల మధ్య సులభంగా మసకబారుతుంది. అయితే, ఏకాగ్రమైన మనస్సుతో మనల్ని మనం ఆయన సన్నిధిలో ఉంచుకొని, ఆయన అందించిన ఒక విముక్తి దాయకమైన సత్యాన్ని కూడా అంతర్లీనంగా గ్రహించినప్పుడు, అది ప్రేరేపిత శక్తిగా, గురువు యొక్క సహాయ సాధనంగా మారుతుంది. ఆయనను అనుసరించే మన ప్రయత్నాలలో మన మానవ వివేకము ఒక ముఖ్యమైన సాధనం అయినప్పటికీ, అది అహంకారపు పక్షపాతానికి-దాని ప్రాధాన్యతలు మరియు దుర్బల్యాలకు లోబడి ఉంటుంది, ఇది ఆయన మార్గదర్శక స్వరాన్ని వినగల మన సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. కొన్ని సమయాల్లో మనస్సు గురువు యొక్క సంకల్పానుసారంగా మన కోరికలను హేతుబద్ధం చేస్తుంది లేదా “చిన్న అహం” కష్టంగా భావించే వాటిని ప్రతిఘటిస్తుంది. మనము నిష్కపటమైన మరియు నమ్మకమైన హృదయంతో వింటే లోతైన అనుసంధానం మరియు అవగాహన వస్తుంది. భగవంతుని దయ మరియు గురువు ప్రేమకు మనం ప్రతిస్పందించి, ఆయన మన అత్యున్నతమైన మంచిని మాత్రమే కోరుకుంటున్నాడని గ్రహించినప్పుడు, అహం యొక్క రక్షణ కవచం కరిగిపోతుంది. ఆయన పరివర్తక స్పర్శకు మనం మరింత అనుకూలంగా మారతాము, మనం మార్చుకోవలసిన వాటిని మరింత స్పష్టంగా చూడగలుగుతాము. వినయంతో మరియు భక్తితో ఆయనకు పూర్తిగా లొంగడం ద్వారా, మన ఆత్మవికాసాన్ని వేగవంతం చేయడానికి గురువు యొక్క శక్తిని నిరంతరాయంగా పని చేయడానికి అనుమతిస్తాము. సవాళ్లతో కూడిన పరిస్థితులు మనకు ఎదురైనప్పటికీ, మనల్ని దేవునికి దగ్గర చేసే శుద్ధీకరణ ప్రక్రియలో భాగంగానే మనం వాటిని బాగా అంగీకరించగలుగుతాము.

గురుదేవులు బోధించిన పవిత్రమైన ధ్యాన పద్ధతుల ద్వారా, మన ఆత్మతో ఆయనను వినడం ద్వారా ఆయనతో సంభాషించటానికి అత్యంత ప్రత్యక్షమైన మార్గాలను అందించారు. చంచలమైన ఆలోచనలు మరియు భావోద్వేగాలు నిశ్చలమైనప్పుడు అహంకార జఢత్వం నిలిచిపోతుంది, గురువు ఉనికిని గ్రహించడానికి మన ఆత్మ యొక్క అంతర్ దృష్టి మేల్కొంటుంది. ఆయన అనంత చైతన్యాన్ని మనం స్పృశించినప్పుడు మన గ్రహణశక్తి పెరుగుతుంది. పదాల మాధ్యమాన్ని మించిన స్పష్టతతో మనం ఆయన ఆలోచనలను అర్థం చేసుకుంటాము. మీ మొత్తం వ్యక్తిత్వంతో మీరు ఆయనను వింటూ మరియు నమ్మకంగా అనుసరించినట్లయితే, మీ ఆత్మ యొక్క దివ్య ప్రియతమునితో మీరు ఐక్యం అయ్యే వరకు ప్రతి అడ్డంకిని అధిగమించడానికి ఆయన మీకు సహాయం చేస్తాడు. జై గురు!

దేవుడు మరియు గురుదేవుల ప్రేమ మరియు నిరంతర ఆశీర్వాదాలతో,

శ్రీ శ్రీ మృణాళినీమాత

Share this on