వై‌.ఎస్‌.ఎస్./ఎస్‌.ఆర్‌.ఎఫ్. అధ్యక్షులు స్వామి చిదానంద గిరి గురు పూర్ణిమ సందేశం – 2019

10 జూలై, 2019

ప్రియతములారా,

గురు పూర్ణిమ భారతదేశం మరియు ప్రపంచవ్యాప్తంగా, గురువుకు నివాళులర్పించే సంప్రదాయాన్ని అనుసరించే అనేక జీవాత్మలను కలుపే ఒక పవిత్రమైన రోజు– గురువు మన ఆత్మల సహజ ప్రకాశాన్ని కప్పివేసే మాయ యొక్క “చీకటిని తొలగించే” వాడు. మనందరి ప్రియతమ గురుదేవులు శ్రీ శ్రీ పరమహంస యోగానంద, మన జీవితాల్లో కురిపించిన అసంఖ్యాకమైన ఆశీర్వాదాలకు మనం కృతజ్ఞతలు అర్పిస్తాము; మరియు ఆయన మనకు ప్రసాదించిన సాధనను మరింత ఉత్సాహంగా అనుసరించాలని పునఃసంకల్పిద్దాం.

గురుదేవుల యొక్క సర్వవ్యాపక చైతన్యంలో ఆయనకు మనకూ మధ్య ఎటువంటి అడ్డంకి లేదు. తన శరీరాన్ని విడిచిన తర్వాత కూడా, తన నిత్య సంరక్షణ మరియు మార్గదర్శకత్వం ఉంటుందని ఆయన తన శిష్యులకు హామీనిచ్చారు: “నేను మీలో ప్రతి ఒక్కరినీ ఎల్లప్పుడూ గమనిస్తూ ఉంటాను, అంతేకాదు నిజమైన భక్తుడు తన ఆత్మ యొక్క నిశ్శబ్ద లోతుల్లో నా గురించి తలచుకున్నప్పుడు, నేను తన సమీపంలోనే ఉన్నానని తెలుసుకుంటాడు”. “ఆయన నాతో మాట్లాడుతున్నాడు” అనే తలంపుతో మీరు ఆయన పాఠాలు మరియు ఇతర రచనలను అధ్యయనం చేస్తున్నప్పుడు, ఆ పదాలు ఆయన దివ్య-చైతన్యం యొక్క పరివర్తన శక్తితో సంతృప్తమవుతాయి. మీరు ఒక సమస్యను పరిష్కరించాల్సిన అవసరం వచ్చినప్పుడు, మిమ్మల్ని మీరు ఆతని శాంతి సౌరభంతో పరివేష్టింపచేసుకొని వారి మార్గదర్శకత్వాన్ని కోరితే, మీ మార్గాన్ని మరింత స్పష్టంగా చూడటానికి ఆయన మీకు సహాయం చేస్తారు. మీరు పొరపాటు చేస్తే లేదా అసహ్యకరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లయితే, ఆయనను మదిలో అడగండి: “నేను ఏమి నేర్చుకోవాలనుకుంటున్నావు?” సదా ఆయన మార్గనిర్దేశనం కోసం తెరవబడి ఉండటం వలన మీ ఆత్మ పురోగతి వేగవంతం చేయడానికి మీకు విలువైన అవగాహనా రత్నాలను ప్రసాదిస్తుంది.

ధ్యానం ద్వారా గురువుతో గాఢమైన అనుసంధానం ఏర్పడుతుంది. ధ్యానం చేయడానికి మీరు గురుదేవుల చిత్రం ముందు కూర్చున్న వెంటనే, ఆయన సజీవ సన్నిధిలో మిమ్మల్ని మీరు నిలుపుకోండి, తద్వారా ఆయన ఉన్నత చైతన్యం మరియు సాన్నిహిత్యం యొక్క శక్తి మీ సాధనను బలోపేతంచేస్తుంది. వారి ఆశీర్వాదాలతో సర్వవ్యాప్తి చెందిన వై‌.ఎస్‌.ఎస్./ఎస్‌.ఆర్‌.ఎఫ్. పవిత్ర ప్రక్రియలను ఆచరించడం ద్వారా, ఆంతరింగిక అశాంతి క్రమంగా తొలగిపోతుంది. అంతేకాదు మీ ఆత్మ యొక్క నిశ్శబ్ద ఆలయంలో మీరు ఆయన అనంతమైన ప్రేమను మరింత స్పష్టంగా అనుభూతి చెందుతారు, అది మీలోని దివ్య లక్షణాలను బయటకు తీసుకురావడానికి సదా ప్రోత్సాహాన్నిస్తుంది మరియు సహాయం చేస్తుంది.

భగవంతుడు మరియు గురుదేవుల ప్రేమ మరియు ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ మిమ్మల్ని నింపుగాక,

స్వామి చిదానంద గిరి

కాపీరైట్ © 2019 సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్. అన్ని హక్కులూ ఆరక్షితమైనవి.

Share this on