స్వామి చిదానంద గిరి నుండి 2020 క్రిస్మస్ సందేశం

4 డిసెంబర్, 2020

క్రిస్మస్ -25-2020
ప్రియతములరా,
మీకు సౌభాగ్యవంతమైన క్రిస్మస్! ఈ పవిత్ర తరుణంలో దేవుని ఆనంద కాంతులతో పునరుద్ధరించిన సమృద్ధి మీ గ్రహణ శీల హృదయ౦లోకి, ప్రప౦చవ్యాప్త౦గా ఉన్న మన ఆధ్యాత్మిక కుటు౦బ సభ్యుల౦దరి హృదయాల్లోకి, అలాగే స్నేహితుల హృదయాల్లోకి ప్రవహి౦చాలని నేను ప్రార్థిస్తున్నాను. క్రీస్తు మరియు మహా గురువుల ప్రత్యేక ఆశీర్వాదాలు మన మానవ కుటుంబం ఎదుర్కొంటున్న సవాళ్ల నుండి ఆధ్యాత్మిక సత్యసంధత మరియు దైవిక విలువల విజేతలుగా మార్చడానికి అవసరమైన ఉన్నత చైతన్యంలోకి మనలో ప్రతి ఒక్కరినీ తీసుకువెళతాయి.బాల ఏసు జననంతో సహస్రాబ్దాల క్రిత౦ ప్రకాశి౦చిన క్రీస్తు-ప్రేమ యొక్క కాంతి — అలాగే మళ్ళీ సంవత్సరం యొక్క ఈ పవిత్ర సమయంలోనూ — అవే ఆన౦ద కాంతులు, అదే మన జీవితాలను మార్చే ఇంకా లోకాన్ని స్వస్థపరిచే శక్తిని కలిగివు౦ది. భగవంతుని స్వరూపంలో నిర్మితమై ఉన్న, ఆ వెలుగు, ప్రేమ, పరమానందమే మన ఆత్మల సారం; మరి దానిని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తే, అచంచలమైన సహజజ్ఞానం విశ్వాసం మరియు భరోసాకు జన్మనిస్తుంది.
ఈ ద్వంద్వత్వపు లోకంలో మన జీవితగతిలో విభేదాలు, అనిశ్చితులు ఉన్నప్పటికీ, దివ్య పిత మనకు సహాయ౦ చేయడానికి ప౦పి౦చిన దైవ- సమన్విత ఆత్మల ప్రోత్సాహాన్ని, మద్దతును మన౦ ఎల్లవేళలా పొ౦దుతా౦. అలాంటివాడే ఏసు ప్రభువు, బాహ్య స్థితి, మానవ అజ్ఞానం యొక్క అన్ని పరిమితులను అధిగమించి, భగవత్ చైతన్యం యొక్క అంతర్గత స్వేచ్ఛలో జీవించగల దివ్య లక్షణాల అందమైన సమ్మిళితమే ఆయన జీవితం. ఏసు యొక్క ఆధ్యాత్మిక సాఫల్యాన్ని ఒక మినహాయింపుగా ప్రశంసించకుండా, మనమందరం గ్రహించి సాధించడానికి ఉద్దేశించిన మార్గదర్శకముగా చూడాలని, మన గురుదేవులు పరమహంస యోగానంద మనకు గుర్తు చేశారు. ఈ పవిత్ర సమయ౦లో భూమిపై ప్రసరించే “క్రిస్మస్ ఆత్మ” లేదా దివ్య లోక ప్రకంపనలు: మన ఆసక్తిని స్వల్పమైన “నేను”కు మించి విస్తరి౦పజేయడ౦; కరుణ, అవగాహన, క్షమాగుణాన్ని వ్యక్తపరచడం; అందరిలోను మంచిని మరియు భగవంతుడిని చూడటం మరియు వినయంగా సేవించడంలాంటి క్రీస్తు లక్షణాలను వ్యక్తపరచడాన్ని సులభతరం చేస్తాయి. మనం ఆకాంక్షించే ప్రతి తల౦పును ఉదాత్తమైన చర్యగా మార్చటపుడు ఏసు జీవి౦చిన క్రీస్తు చైతన్యానికి దగ్గరవుతా౦.
ఏసు దివ్య పితతో తన అంతర్గత సహవాసపు లోతుల ను౦డి తన బలాన్ని, జ్ఞానాన్ని, సర్వాలంబనమైన ప్రేమను పొ౦దాడు; అలాగే మన౦ కూడా నిష్ఠాపరమైన ధ్యానము మరియు ప్రార్థన ద్వారా, ఆ మూలాన్ని గ్రహి౦చి, మనలోని శ్రేష్ఠమైనవాటిని వెలికితీసి, ఆ విధ౦గా మన విభజనాత్మక జీవన పరిస్థితులను మెరుగుపరచుకోవడానికి సహాయ పడవచ్చు. మనలో ప్రతి ఒక్కరితోనూ శాంతి మొదలవుతుంది. ఏసు మరియు బాబాజీ ఆదేశాల మేరకు, దేవునితో మరియు విశ్వ క్రీస్తుతో ఆ సంబంధాన్ని ఏర్పరచుకోవడంలో మనకు సహాయపడటానికి, మన గురుదేవులు 100 సంవత్సరాల క్రితం పాశ్చాత్య దేశాలకు తీసుకువచ్చిన ఈ మార్గంలో పవిత్ర శాస్త్రం యొక్క ఆశీర్వాదం మనకు ఉంది —  అంతేకాదు ఆయన ప్రారంభించిన అద్భుతమైన సంప్రదాయం క్రిస్మస్ సందర్భంగా క్రీస్తుపై ప్రత్యేక ధ్యానం చేయడం. గురుదేవులు ఇలా అన్నారు, “రోజంతా క్రిస్మస్ ధ్యానం చేయాలనే ఆలోచన నిజంగా క్రీస్తు నాకు ఇచ్చాడు, అతను మీ కోసం ఏదైనా చేయగలడు.” మీరు ఈ క్రిస్మస్ ను ధ్యానిస్తున్నప్పుడు, పైన ముద్రించబడిన పరమహంస గారి ప్రోత్సాహకరమైన మాటల గురించి ఆలోచించండి. దివ్య ప్రేమ, శాంతి మరియు ఆనందంయొక్క క్రీస్తు-బహుమతులకు మీ హృదయాన్ని తెరవడం ద్వారా, మీ కుటుంబం, స్నేహితులు, మీ సంఘం మరియు ప్రపంచంతో పంచుకునే ఆశీర్వాదంగా అవి మీ విస్తరిస్తున్న చైతన్యం నుండి పొంగుతాయి.

మీకు మరియు మీ ప్రియతములకు సంతోషకరమైన క్రీస్తు-పూర్ణమైన క్రిస్మస్ శుభాకాంక్షలు,

స్వామి చిదానంద గిరి

కాపీరైట్ © 2020 సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్. అన్ని హక్కులు ఆరక్షితం.

Share this on