ఆధ్యాత్మిక పరంపర

యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా (సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్) యొక్క బోధనలు భగవాన్ కృష్ణుడి అసలైన యోగం మరియు జీసస్ క్రైస్ట్ యొక్క అసలైన క్రైస్తవ మతం మీద స్థాపించబడ్డాయి. వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. యొక్క ఆధ్యాత్మిక పరంపరలో ఈ రెండు గొప్ప అవతారాలు మరియు సమకాలీన ఉన్నత మహాత్ములు ఉన్నారు: శ్రీ మహావతార్ బాబాజీ, శ్రీ లాహిరీ మహాశయులు, స్వామి శ్రీ యుక్తేశ్వరులు, మరియు శ్రీ పరమహంస యోగానందలు (వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. గురువుల వరుసలో చివరి వారు).

క్రియాయోగము అనే ఆధ్యాత్మిక శాస్త్రాన్ని ఆధునిక ప్రపంచానికి అందించాలనే యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా యొక్క కార్యములో ఈ మహాత్ములు ప్రముఖ పాత్ర పోషించారు.(మరింత చదవడానికి ఫోటోలపై క్లిక్ చేయండి.)

పవిత్రమైన క్రియాయోగ దీక్ష తీసుకున్న యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా సభ్యులందరూ (సన్యాసులు అలాగే సాధారణ సభ్యులు) శ్రీ పరమహంస యోగానందగారి శిష్యులు. ఆయన వారి వ్యక్తిగత గురువుగా గౌరవం మరియు భక్తిని పొందుతారు, మరియు ఆయన గురువుల పరంపరలోని అందరు వై.ఎస్.ఎస్. శిష్యులచే భక్తితో గౌరవించబడతారు. గురు-శిష్యుల సంబంధం గురించి మరింత చదవండి.

గురు-పరంపర — గురువు యొక్క ఆధ్యాత్మిక బాధ్యత

గురువుకి చెందిన వారసత్వాన్ని కొనసాగించడానికి నియమించబడిన శిష్యుడికి గురువు యొక్క ఆధ్యాత్మిక సంపదని అందజేయడాన్ని గురు-పరంపర అని పిలుస్తారు. పరమహంస యోగానందగారు ఈ విధంగా మహావతార్ బాబాజీ, లాహిరీ మహాశయులు మరియు స్వామి శ్రీ యుక్తేశ్వరులు యొక్క ప్రత్యక్ష గురు పరంపరకు చెందినవారు.

ఆయన మహాసమాధికి ముందు, పరమహంస యోగానందగారు, వై.ఎస్.ఎస్. గురు పరంపరలో తాను చివరి గురువు కావాలని దేవుని కోరిక అని పేర్కొన్నారు. వారి సంస్థలో తరువాత వచ్చిన శిష్యుడు లేదా నాయకుడు, తమను తాము గురువుగా ఎప్పటికీ భావించరు. (ఈ దైవిక శాసనం మత చరిత్రలో ప్రత్యేకమైనది కాదు. సిక్కు మతాన్ని స్థాపించిన గొప్ప సాధువు గురునానక్ పరమపదించిన తరువాత, గురువుల యొక్క సాధారణ వారసత్వం ఉంది. ఆ వరుసలో పదవ గురువు తాను గురువుల శ్రేణిలో ఆఖరి గురువు అని ప్రకటించారు, ఇక నుండి తన బోధనలను గురువుగా పరిగణించాలి అని కోరారు.)

పరమహంసగారు తన మహాసమాధి తరువాత, తాను స్థాపించిన, యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ సంస్థ ద్వారా పని చేస్తానని హామీ ఇచ్చారు. ఆయన ఇలా అన్నారు, “నేను వెళ్ళిపోయిన తరువాత నా బోధనలు గురువు అవుతాయి…. బోధనల ద్వారా మీరు నాతో మరియు నన్ను పంపిన గొప్ప గురువులతో అనుసంధానంలో ఉంటారు.”

వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. నాయకత్వం యొక్క వారసత్వం గురించి ప్రశ్నించినప్పుడు, ఆయన ఇలా సమాధానమిచ్చారు, “దైవసాక్షాత్కారం పొందిన పురుషులు మరియు మహిళలు ఈ సంస్థకు నాయకులుగా ఎల్లప్పుడూ ఉంటారు. వారు దేవుడికి మరియు గురువులకు ముందే తెలుసు. వారు నా ఆధ్యాత్మిక వారసులుగా మరియు అన్ని ఆధ్యాత్మిక మరియు సంస్థాగత విషయాలలో ప్రతినిధిగా పనిచేస్తారు.”

గురుదేవుల ఆధ్యాత్మిక వారసులు

శ్రీ శ్రీ రాజర్షి జనకానంద

రాజర్షి జనకానంద 1952లో పరమహంస యోగానందగారి తరువాత వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్ష పదవిని చేపట్టారు. ఆయన జేమ్స్ జె. లిన్ అనే నామంతో మే 5, 1892న లూసియానాలోని ఆర్కిబాల్డ్ లో జన్మించారు; మరియు 1932లో కాన్సాస్ నగరంలో గురువుగారి ఉపన్యాస సరళి జరుగుతున్నప్పుడు, పరమహంస యోగానందగారిని కలిశారు.

క్రియాయోగములో వేగంగా అభివృద్ధి చెందడం వల్ల, పరమహంసగారు ప్రేమతో ఆయనను “సెయింట్ లిన్” అని పిలిచేవారు. 1951లో యోగానందగారు ఆయనకి రాజర్షి జనకానంద (పురాతన భారతదేశపు, ఆధ్యాత్మికంగా ప్రసిద్ధి గాంచిన జనక మహారాజు గుర్తుగా) అనే సన్యాసి బిరుదును ప్రసాదించారు మరియు వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. పనికి మార్గ నిర్దేశం చేసే బాధ్యతను ఆయనకు అప్పగించారు.

రాజర్షి జనకానంద గురించి మరింత చదవండి.

గొప్ప పాశ్చాత్య యోగి అయిన రాజర్షి జనకానంద యొక్క ఆదర్శప్రాయమైన జీవితం ఫిబ్రవరి 20, 1955న ముగిసింది.

రాజర్షి జనకానందను దీవిస్తున్న యోగానంద

శ్రీ శ్రీ దయామాత

శ్రీ శ్రీ దయామాత 1955లో రాజర్షి జనకానంద తరువాత వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్ష పదవిలోకి వచ్చారు.

పరమహంస యోగానందతో దయామాత

ఫే రైట్ గా జనవరి 31, 1914న సాల్ట్ లేక్ సిటీలో జన్మించిన ఆమె, 1931లో అక్కడ ఉపన్యాసాలు మరియు తరగతులు ఇవ్వడానికి పరమహంస యోగానందగారు వచ్చినప్పుడు, ఆయనను కలుసుకున్నారు. కొంతకాలం తర్వాత, ఆమె సన్యాసినిగా ఆయన ఆశ్రమంలోకి ప్రవేశించారు.

ఇరవై సంవత్సరాలకు పైగా, శ్రీ దయామాత, యోగానందగారితో నిరంతరం ఉన్న తన సన్నిహిత శిష్యుల యొక్క చిన్న సమూహములో భాగమయ్యారు. సంవత్సరాలు గడిచే కొద్దీ, యోగానందగారు ఆమెకు మరింత ఎక్కువ బాధ్యతను అప్పగించారు. దయామాతను పిన్న వయసులోనే , 1930లలో వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో అధికారిగా నియమించారు. తన జీవితపు ముగింపు కాలంలో, యోగానందగారు ఆమెకు ఎస్.ఆర్.ఎఫ్. అంతర్జాతీయ ప్రధాన కార్యాలయం బాధ్యతలు అప్పగించారు మరియు ఆమె పోషించాల్సిన ప్రపంచవ్యాప్త పాత్ర గురించి శిష్యులతో చెప్పడము ప్రారంభించారు. మహాసమధికి కొంతకాలం ముందు యోగానందగారు, ఆమెతో ఇలా అన్నారు: “ఇప్పుడు నా పని పూర్తయింది; నీ పని ప్రారంభమవుతుంది.”

శ్రీ దయామాత గురించి మరింత చదవండి.

1962లో భారతదేశంలో శ్రీ దయామాత తీర్థయాత్ర చేస్తున్న సందర్భంలో మహావతార్ బాబాజీని ఆకస్మికంగా కలసినప్పుడు, పరమహంసగారు తన ప్రపంచవ్యాప్త సంస్థకు కాబోయే నాయకురాలిగా శ్రీ దయామాతను ఎన్నుకున్నట్లు మహావతార్ బాబాజీ ధృవీకరించారు.

55 ఏళ్ళకు పైగా వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్.కి అధ్యక్షురాలిగా ఉన్న శ్రీ దయామాతగారు నవంబర్ 30, 2010న పరమపదించారు.

శ్రీ శ్రీ మృణాళినీమాత

ఆగష్టు 3, 2017న, మన ప్రియమైన సంఘమాత మరియు అధ్యక్షురాలు శ్రీ శ్రీ మృణాళినీమాత, పరమాత్మ శాశ్వత రాజ్యంలోని ఆనందం మరియు స్వేచ్ఛ కోసం శాంతియుతంగా ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టారు. పరమహంస యోగానందగారి బోధనల ద్వారా రూపాంతరం చెందిన లక్షలాది సత్యాన్వేషకులకు జ్ఞానం, ప్రేమ మరియు అవగాహనల మార్గదర్శక కాంతిగా శ్రీ మృణాళినీమాత ఉన్నారు. గురుదేవుల ఆధ్యాత్మిక మరియు మానవతా సేవ చేయడానికి శ్రీ మృణాళినీమాత 70 సంవత్సరాలకు పైగా తనను తాను అంకితం చేసుకున్నారు.

 శ్రీ మృణాళినీమాత గురించి మరింత తెలుసుకోండి.

స్వామి చిదానంద గిరి

యోగదా సత్సంగ సొసైటి ఆఫ్ ఇండియా/సెల్ఫ్- రియలైజేషన్ ఫెలోషిప్ (వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్.)కు అధ్యక్షులుగా మరియు ఆధ్యాత్మిక అధిపతిగా, శ్రీ మృణాళినీమాత తరువాత శ్రీ స్వామి చిదానంద గిరి ఎన్నుకోబడ్డారనే వార్త పంచుకుంటున్నందుకు యోగదా సత్సంగ సొసైటి ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ బోర్డు డైరెక్టర్లు ఆనందముగా ఉన్నారు. శ్రీ మృణాళినీమాత, జనవరి 2011 నుండి గత నెల ఆమె పరమపదించే వరకు ఆమె ఈ పదవిలో ఉన్నారు. ఆగస్టు 30, 2017 బుధవారం ఎస్‌.ఆర్‌.ఎఫ్. డైరెక్టర్ల బోర్డు ఏకగ్రీవ ఓటు ద్వారా స్వామి చిదానంద గిరి గారి నియామకం జరిగింది.

 స్వామి చిదానంద గిరి గురించి మరింత తెలుసుకోండి.

Share this on